అమెరికాలో మళ్ళీ 'షట్‌డౌన్' సంక్షోభం
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పరిపాలన స్తంభించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియడంతో, యూఎస్ ప్రభుత్వం అధికారికంగా 'షట్‌డౌన్' లోకి వెళ్లిపోయింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పరిపాలన స్తంభించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియడంతో, యూఎస్ ప్రభుత్వం అధికారికంగా 'షట్‌డౌన్' లోకి వెళ్లిపోయింది. దీనివల్ల హోంల్యాండ్ సెక్యూరిటీ సహా పలు కీలక విభాగాలకు నిధుల సరఫరా నిలిచిపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. ఇటీవల మినియాపొలిస్‌లో జరిగిన కాల్పుల ఘటన ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోవడంపై సెనెట్ డెమోక్రాట్లు నిప్పులు చెరుగుతున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులకు, సరిహద్దు భద్రతకు ప్రజలు అండగా ఉంటారు. కానీ, వీధుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, పౌరుల ప్రాణాలు తీసే ఐసీఈ అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం" అని డెమోక్రాట్ సభ్యులు స్పష్టం చేశారు.
సదరు విభాగంలో తక్షణ సంస్కరణలు చేపట్టనిదే నిధుల బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని వారు చెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికాలో షట్‌డౌన్ సంక్షోభం కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 అక్టోబరు 1న మొదలైన షట్‌డౌన్ ఏకంగా 43 రోజుల పాటు కొనసాగి, అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచింది. 1981 నుంచి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం 16 సార్లు మూతపడింది. గతంలో ట్రంప్ హయాంలో (2018-19) కూడా 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. ప్రస్తుతానికి ఇది పాక్షిక షట్‌డౌన్ మాత్రమేనని, వచ్చే వారం నిధుల బిల్లుపై తిరిగి చర్చలు జరుపుతామని చట్టసభ సభ్యులు చెబుతున్నారు. అయితే, డెమోక్రాట్లు తమ పట్టు వీడకపోతే ఈ ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగే ప్రమాదం ఉంది. తద్వారా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ప్రజా సేవలకు ఆటంకం కలగనుంది.



