ఇరాన్ ‘నో ఫ్లై’ జోన్

ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలం మూసివేత

ఇరాన్ ‘నో ఫ్లై’ జోన్

ఇరాన్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో ఆ దేశ గగనతలం మూతపడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన వైమానిక మార్గాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేసింది.

విశ్వంభర, బ్యూరో: ఇరాన్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో ఆ దేశ గగనతలం మూతపడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన వైమానిక మార్గాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇరాన్ పరిణామాల నేపథ్యంలో దేశీయ విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, ఇండిగో తమ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన విమానాలను సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో లేని కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. "ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం" అని ఎయిరిండియా ఎక్స్ వేదికగా పేర్కొంది. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో విమాన సమయాల గురించి ఎప్పటికప్పుడు ఆయా సంస్థల వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా అప్‌డేట్స్ తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More ట్రంప్ మమ్మల్ని ఫూల్స్ ని చేశాడు..!!

మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. రాబోయే 24 గంటల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు తక్షణమే అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశాన్ని వీడాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.