గ్రీన్‌లాండ్‌పై అమెరికా గురి
మంచు ఖండంలో యుద్ధ విమానాల మోహరింపు
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే పాత ఆలోచనను అమెరికా మళ్లీ తెరపైకి తెస్తోంది. కేవలం కొనుగోలు ప్రతిపాదనలతోనే కాకుండా, ఇప్పుడు రక్షణ పరంగా ఆ ద్వీపంపై తన పట్టును బిగించేందుకు 'డైరెక్ట్ యాక్షన్' మొదలుపెట్టింది.
విశ్వంభర బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే పాత ఆలోచనను అమెరికా మళ్లీ తెరపైకి తెస్తోంది. కేవలం కొనుగోలు ప్రతిపాదనలతోనే కాకుండా, ఇప్పుడు రక్షణ పరంగా ఆ ద్వీపంపై తన పట్టును బిగించేందుకు 'డైరెక్ట్ యాక్షన్' మొదలుపెట్టింది. గ్రీన్‌లాండ్‌లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరం వద్ద యుద్ధ విమానాలను మోహరించేందుకు అమెరికా సిద్ధమవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.
నార్డ్ ప్రకటనతో మొదలైన కలకలం
నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌లాండ్‌లోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న పిటుఫిక్ (గతంలో తూలే) స్పేస్ బేస్‌కు త్వరలోనే తమ శక్తివంతమైన యుద్ధ విమానాలు చేరుకుంటాయని అమెరికా సైన్యం ప్రకటించింది. ఉత్తర అమెరికా ఖండ రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రు దేశాల కదలికలను నిశితంగా గమనించడమే ఈ మోహరింపు ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
ఈ మోహరింపు వ్యవహారంపై అమెరికా సైన్యం ఒక ఆసక్తికర వివరణ ఇచ్చింది. డెన్మార్క్ రాజ్యంతో సమన్వయం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, గ్రీన్‌లాండ్ ప్రభుత్వానికి కూడా ముందస్తు సమాచారం అందించామని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఈ కీలక పరిణామంపై డెన్మార్క్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.గ్రీన్‌లాండ్‌పై పూర్తి నియంత్రణ సాధించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తాయని డెన్మార్క్‌లోని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గ్రీన్‌లాండ్ ఎందుకు ముఖ్యం?
ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో అమెరికా గ్రీన్‌లాండ్‌ను ఒక 'సహజసిద్ధమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్'గా భావిస్తోంది. ఖనిజ సంపదతో పాటు, రష్యా క్షిపణులను పసిగట్టడానికి ఇక్కడి రాడార్ వ్యవస్థలు అమెరికాకు అత్యంత కీలకం. తాజాగా యుద్ధ విమానాలను మోహరించడం ద్వారా ఈ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని వాషింగ్టన్ గట్టిగా భావిస్తోంది.



