నోరో వైరస్ కలకలం.. 100 మందికి పైగా సోకిన మహమ్మారి..!!

విశ్వంభర, నేషనల్ బ్యూరో: చైనాలోని ఒక పాఠశాలలో అకస్మాత్తుగా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టించింది. వంద మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వైద్య శాఖలు వెంటనే అప్రమత్తమయ్యాయి.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: చైనాలోని ఒక పాఠశాలలో అకస్మాత్తుగా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టించింది. వంద మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వైద్య శాఖలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో 103 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో స్థానిక అధికారులు తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టారు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్కూల్ క్లాస్‌రూములు, కారిడార్లు, ఆవరణ మొత్తం శానిటైజ్ చేసి, వైరస్‌ను నిర్మూలించే ప్రత్యేక మందులను పిచికారీ చేశారు. బాధిత విద్యార్థులకు అవసరమైన వైద్య చికిత్స అందించడంతో పాటు, ఇతర విద్యార్థులకు వైరస్ సోకకుండా జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం వైరస్ బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు.

Read More కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ ప్రత్యేకంగా హాజరు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, స్కూల్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికీ పరీక్షలు నిర్వహించి, వైరస్ మరింత వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలంలో నోరో వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి.

నోరో వైరస్ సోకినవారు సాధారణంగా వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడతారని అధికారులు తెలిపారు. ఈ వైరస్ చాలా సాధారణమైనదే అయినప్పటికీ, వ్యాప్తి వేగంగా జరుగుతుందని హెచ్చరించారు. 1968లో అమెరికాలోని ఓహియో రాష్ట్రం నార్‌వాక్ పట్టణంలోని ఒక స్కూల్‌లో ఈ వైరస్‌ను తొలిసారి గుర్తించడంతో దీనికి నోరో వైరస్ అనే పేరు వచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 68.5 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. అందులో ఐదేళ్లలోపు చిన్నారులు సుమారు 20 కోట్ల మంది ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ వైరస్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది మృతి చెందుతుండగా, అందులో 50 వేల మంది చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags: