మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ - AIPSO
గాజా కోసం ఇటలీ ఒక్కరోజు సమ్మె – మానవత్వానికి మద్దతుగా కార్మికుల గళం
On
విశ్వంభర, మహబూబ్ నగర్ :- ప్రపంచవ్యాప్తంగా గాజా యుద్ధం మానవ విలువలను ప్రశ్నార్థకం చేస్తోన్న సమయంలో, ఇటలీ ప్రజలు ఒక విశేషమైన సందేశం ఇచ్చారు – మానవత్వం రాజకీయాలను మించినదని. 2025 సెప్టెంబర్ 22న ఇటలీ అంతటా మిలియన్ల మంది కార్మికులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి ఒక రోజు సాధారణ సమ్మె (General Strike) నిర్వహించారు. ఈ సమ్మె గాజా ప్రజల పట్ల ఐక్యమత్యాన్ని ప్రదర్శిస్తూ, యుద్ధానికి వ్యతిరేకంగా మానవతా గళం వినిపించింది. ఈ సమ్మెకు పిలుపునిచ్చినది ఇటలీ ప్రముఖ కార్మిక సంఘం USB (Unione Sindacale di Base). సమ్మె లక్ష్యం – మానవత్వం కోసం పోరాటం - సమ్మె పిలుపులో USB నాయకులు స్పష్టంగా పేర్కొన్నారు. “మన వేతనాలకోసం మాత్రమే కాదు, మానవత్వం కోసం కూడా మన గళం వినిపించాలి. గాజాలో జరుగుతున్న పిల్లల మరణాలు, ఆకలి, విధ్వంసం ఇక సహించలేం.”మని , వారి మాటల్లో ఒక స్పష్టమైన బాధ ఉంది — గాజాలో నిరపరాధ పిల్లలు మరణిస్తుండగా, ప్రపంచం మాత్రం రాజకీయ లెక్కలకే పరిమితమైందన్న ఆవేదన. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని, పాలస్తీనా ప్రజలకు మానవీయ సహాయం అందించాలనీ, అలాగే పాశ్చాత్య దేశాలు తమ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఇటలీ ప్రభుత్వ వైఖరి – ఇజ్రాయెల్‌కు మద్దతు - ఇటలీ ప్రధానమంత్రి జియోర్జియా మెలోనీ ఈ సమ్మెపై ప్రత్యక్షంగా స్పందించకపోయినా, ఆమె ప్రభుత్వం స్పష్టంగా ఇజ్రాయెల్ పక్షాన ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మెలోనీ గతంలో ప్రకటించిన ప్రకారం- “ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకునే హక్కు కలిగి ఉంది. హమాస్ చేసిన దాడులు ఉగ్రవాద చర్యలు.” దీనిని బట్టి ఇటలీ ప్రభుత్వం ఇజ్రాయిల్ వైపు ఉందని స్పష్టమవుతుంది. అయితే ఆమె పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం అందించాలనే అవసరాన్ని కూడా గుర్తించింది. అంటే ప్రభుత్వం రాజకీయంగా ఇజ్రాయెల్ పక్షాన ఉన్నప్పటికీ, ప్రజల్లో మాత్రం దానికి వ్యతిరేక భావజాలం పెరుగుతోంది. ప్రజల స్పందన – రోడ్లపై మానవతా గళం - ఇటలీ ప్రజలు మాత్రం విభిన్నంగా స్పందించారు. రోమ్, మిలాన్, ఫ్లోరెన్స్, నాపల్స్ వంటి నగరాల్లో “Stop War in Gaza”, “Freedom for Palestine”, “Humanity First” అనే నినాదాలతో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థులు పాఠశాలలు మూసివేసి వీధుల్లోకి వచ్చారు. కార్మికులు తమ ఫ్యాక్టరీల నుంచి బయటికి వచ్చి ఒకే స్వరంగా మానవత్వానికి మద్దతుగా నిలబడ్డారు. రోడ్లపై పసి పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ ఒకే స్ఫూర్తితో పాల్గొన్నారు — “మానవత్వం ఏ దేశానికీ పరిమితం కాదు” అని చాటిచెప్పారు. - ప్రపంచానికి పంపిన సందేశం - ఈ సమ్మె కేవలం ఇటలీ సరిహద్దుల్లో మాత్రమే ఆగిపోలేదు. ప్రపంచ మీడియా అంతా ఇటలీ ప్రజల ఈ ఐకమత్యాన్ని ప్రశంసించింది. అనేక దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు కూడా ఇటలీ ఉద్యమాన్ని ఆదర్శంగా చూపించాయి.
ఈ సమ్మె ద్వారా ఇటలీ ప్రజలు ప్రపంచానికి చెప్పిన సందేశం చాలా లోతైనది — “మానవత్వం రాజకీయాల కన్నా పెద్దది. మానవ హక్కుల కోసం పోరాడే ప్రతివాడు గాజా పిల్లల కన్నీటిలో ప్రతిపంపిస్తూ ఉంటాడు .”
అగ్రరాజ్యాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గాజా ప్రజల బాధలను పట్టించుకోకపోయినా, ఇటలీ ప్రజలు మానవత్వం కోసం గళమెత్తారు.
తుదిమాట – మానవత్వమే మతం
గాజాలో పిల్లలు చనిపోతుంటే, ఇళ్లంతా బూడిదవుతుంటే, నిశ్శబ్దంగా ఉండటం కూడా నేరమే. కానీ ఇటలీ ప్రజలు నిశ్శబ్దం కాకుండా ప్రతిఘటన స్వరాన్ని ఎంచుకున్నారు. తాము చరిత్రలో నేరస్తులుగా మిగలమని తేల్చేశారు. - వారు పంపిన సందేశం ప్రపంచమంతటికి ఒక పాఠం. - “మానవత్వం ఏ దేశానికీ, ఏ మతానికీ పరిమితం కాదు. బాధపడుతున్నవారి పక్షాన నిలబడటమే నిజమైన మానవతా విలువ.”లని.
నేహా ఉమైమ
AIPSO, మహబూబ్ నగర్



