దర్శకుడు తేజ కుమారుడికి రూ. 72 లక్షల టోకరా
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిన ఒక జంట.. ఆయన నుంచి ఏకంగా రూ. 72 లక్షలు వసూలు చేసి మాయమయ్యారు.
విశ్వంభర తెలంగాణ బ్యూరో: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిన ఒక జంట.. ఆయన నుంచి ఏకంగా రూ. 72 లక్షలు వసూలు చేసి మాయమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ దంపతులు అమితవ్ తేజను సంప్రదించి తమను ట్రేడింగ్ నిపుణులుగా పరిచయం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని ఆయనను నమ్మబలికారు. వారి మాటలను విశ్వసించిన అమితవ్.. పలు దఫాలుగా మొత్తం రూ. 72 లక్షలను నిందితుల ఖాతాలకు బదిలీ చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత నిందితుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అమితవ్ అనుమానం వ్యక్తం చేశారు. తన పెట్టుబడి గురించి, లాభాల గురించి నిలదీయగా వారు పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేశారు. చివరకు ఫోన్ నంబర్లు మార్చేసి, ఆ దంపతులు పరారీ అవడంతో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై ఐటీ యాక్ట్ సహా వివిధ సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా ఈ దంపతులు ఇంకా ఎవరినైనా మోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.



