రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. 

అక్షర యోధుడుగా శ్రీరామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తిగా అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కీర్తించారు. 

Read More ప్రపంచ బ్యాంక్ కు సలహాలిచ్చే స్థాయికి భారత్ : ఫేమస్ ఎకానమిస్ట్

ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని పునరుద్ఘాటించారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని, మీడియా రంగంలో ఆయనొక శిఖరమని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 

రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు దగ్గర చేసిందని వెల్లడించారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకెంతో స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని, ఆయన అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.