ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు
ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జగన్‌పై నిప్పులు చెరిగారు. ఈ గెలుపు టీడీపీ, జనసేన, బీజేపీ సమష్టి కృషితోనే సాధ్యపడిందని వెల్లడించారు.
ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు ఏపీని కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడిచారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, టీడీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. మళ్లీ ఇవాళ ఊహించని విధంగా అంతటి ఫలితాలు రావడం ఎంతో సంతోషదాయకమన్నారు.
రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయన్నారు. దేశం మాత్రమే శాశ్వతమని రాజకీయాలు కాదంటూ చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు అని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 45.6 శాతం ఓట్లు వచ్చాయని, వైసీపీకి 39.35 శాతం ఓట్లు పోలయ్యాయని, మొత్తంగా కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు.
పక్క రాష్ట్రాలకు కూలికి వెళ్లిన ప్రజలు కూడా రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చి ఓట్లు వేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నారు. జగన్ రాక్షస పాలనలో ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఎన్ని అప్పులు చేశారో, తెచ్చిన అప్పులు సంబంధం లేని వాటిలో వినియోగించారనే విషయాలపై లోతుగా సమీక్షిస్తే తెలుస్తాయన్నారు. ఇవాళ(బుధవారం) ఢిల్లీకి వెళ్తున్నానని, వచ్చాక అన్ని విషయాలపై వివరంగా చెబుతానన్నారు.