బాబుకు బిగ్ రిలీఫ్..ఆ కేసు క్లోజ్..!!

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు న్యాయపరమైన ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు ముగించింది.

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు న్యాయపరమైన ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు ముగించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 37 మందిపై కొనసాగుతున్న విచారణను మూసివేస్తూ సోమవారం కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం అధికారికంగా ముగిసినట్లైంది.

వైసీపీ పాలనలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ 2023 సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది. అప్పట్లో ఈ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. అనంతరం ఈ కేసుపై టీడీపీ తరఫున ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగింది.

Read More విశాఖ జూలో డిప్యూటీ సీఎం పవన్ సందడి

హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు నాయుడు సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తర్వాత 2023 అక్టోబర్ 31న విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో అప్పట్లోనే చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది.

ఇక తాజాగా, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసిన సీఐడీ, తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఏసీబీ కోర్టులో తుది నివేదికను దాఖలు చేసింది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్ అజయ్‌రెడ్డి, తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్, సీఐడీ, పిటిషనర్ తరఫు న్యాయవాదులు విస్తృతంగా వాదనలు వినిపించారు.

అన్ని పక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు అజయ్‌రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఈ కేసు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కారణంగా నమోదైనదిగా పేర్కొంటూ విచారణను పూర్తిగా ముగించారు. ఈ ఉత్తర్వులతో చంద్రబాబు నాయుడుతో పాటు కేసులో ఉన్న మొత్తం 37 మంది నిందితులు అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందారు. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.babu

Tags: