కేసీఆర్‌పై సిట్ విచారణ కక్షసాధింపే
- పటాన్‌చెరులో బీఆర్ఎస్ నిరసన
విశ్వంభర, పటాన్‌చెరు: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సిట్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పటాన్‌చెరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బచ్చుగూడెం చౌరస్తాలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌పై నిందలు వేస్తోందని మండిపడ్డారు. పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి నిరాధారమైన విచారణలు చేస్తోందని వారు ధ్వజమెత్తారు. నిరసన అనంతరం నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాజ్యాంగ విలువలను కాపాడాలని, అప్రజాస్వామికంగా సాగుతున్న సిట్ విచారణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రామేశ్వరం మాజీ ఎంపిటిసి అంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బండి హరి శంకర్, మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య యాదవ్, సర్కిల్ అధ్యక్షులు, మరియు నాయకులు పాటి సత్యనారాయణ, దేవేంద్ర చారి, నర్సింహ, జంగయ్య యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, జైపాల్, అజీమ్, నరేష్, జాన్సన్, మతిన్, వెంకట్ రెడ్డి, జాకిర్, అప్పల భాస్కర్, కుమార్, నర్సింగ్ రావు, కావలి రాములు తదితరులు పాల్గొన్నారు.



