రైతులపై అదనపు తూకం భారం, మిల్లర్లకు కోట్ల లాభం...
విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని 24 గ్రామపంచాయతీల పరిధిలో 31 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 11.84 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2.46 లక్షల బస్తాలు రవాణా చేయగా, మిగిలిన బస్తాలు ఇంకా మార్కెట్ యార్డుల్లోనే నిల్వ ఉన్నాయి. రైతుల నుంచి బస్తాకు అదనంగా సుమారు కిలో తూకం వేయడం వల్ల మిల్లర్లకు భారీ లాభాలు వస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 40 కిలోలు 500 గ్రాములు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా, 1.5 కిలోలకు తక్కువ కాకుండా అదనపు తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అదనపు తూకం కారణంగా మండల వ్యాప్తంగా సింగిల్ విండో, ఐకేపీ, ఎస్‌పీఓ, ఎన్‌డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా సుమారు 5,900 క్వింటాళ్లకు పైగా ధాన్యం ఇప్పటి వరకు అదనంగా మిల్లర్లకు వెళ్ళిందని, దీని విలువ రూ.1.41 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంటున్నారు. రైతుల చెమట ఫలితాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. అవసరమైన లారీలను సమకూర్చి వేగంగా ధాన్యం తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



