భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల పోరాట స్ఫూర్తితో విద్యార్థిలోకం ఉద్యమించాలని పీడీఎస్‌యూ  అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా బాగ్ లింగంపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అరుణోదయ నాయకురాలు విమలక్క మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలనకు వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం ఇంకా సాధ్యం కాలేదని, భగత్ సింగ్ లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం అవసరమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల వల్ల దేశ సంపద కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని విమర్శించారు. దేశ వనరులను పెట్టుబడిదారులకు అప్పగించే విధానాలను యువత ప్రశ్నించాలని కోరారు. ప్రపంచంలో పెరుగుతున్న సామ్రాజ్యవాద పోటీలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో అల్లూరి విజయ్, శివాని, రాకేష్, సురేష్, సౌజన్య, మౌనిక, సాయి, జ్యోత్స్నా, భాను తదితరులు పాల్గొన్నారు.

Tags: