చేనేత కార్మికుల జీవితాలు దుర్భరం 

చేనేత కార్మికుల జీవితాలు దుర్భరం 

విశ్వంభర, సిద్దిపేట: చేనేత కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ పద్మశాలి చేనేత కార్మికుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకుడు భూదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోజువారీ కూలి చేస్తూ జీవనం గడుపుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. పద్మశాలి చేనేత కార్మికులకు బ్యాంక్‌ల ద్వారా రుణాలిచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఇల్లు లేని పేద చేనేతలకు ఇండ్లు మంజూరు చేయాలని, 50ఏండ్లు నిండిన నేతన్నలకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం నాయకులు బాలనారాయణ, కనకరాజు, రఘు పలువురు పాల్గొన్నారు.

Tags: