నేడు వడ్డెర్ల అసెంబ్లీ ముట్టడి
విశ్వంభర, చింతపల్లి: వడ్డెర్ల ఆత్మగౌరవం,వారి న్యాయమైన హక్కుల సాధన కోసం మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవరకొండ వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వడ్డెర కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వంద మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం శోచనీయమన్నారు. ఇది ఈ రోజు మొదలైన పోరాటం కాదని గత 48 ఏళ్లుగా మా జాతి హక్కుల కోసం పోరాడుతున్నాం అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా వడ్డెర్లను ఓటు బ్యాంకులానే చూస్తున్నాయి తప్ప, మా బతుకుల్లో వెలుగు నింపే ప్రయత్నం చేయడం లేదన్నారు. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని గ్రామాలు, పట్టణాలు ,జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరంతరంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వడ్డెర కులస్తులందరూ ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని, మన ఆత్మగౌరవ గళాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.



