భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
- : ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం డి అన్వర్ డిమాండ్
విశ్వంభర, ఉప్పల్: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాట స్పూర్తితో నేటి విద్యార్ధి, యువత తమ హక్కుల కోసం ఉద్యమించాలని కోరుతూ సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతిని ఉప్పల్ డిపో కార్యాలయం వద్ద వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అన్వర్ మాట్లాడుతూ..భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలని,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి, జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలనీ డిమాండ్ చేశారు.భగత్ సింగ్ పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28 న కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు. 3 సంవత్సరాల వయసులో తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు, 20 సంవత్సరాల కాలంలోనే బ్రిటిష్ వారిని గడ గడ లాడించి, 23 సంవత్సరాల వయసులోనే భారత మాత దాస్య శృంఖలాల నుండి విడిపించడం కోసం ప్రాణ త్యాగం చేసి, ప్రతి భారతీయుడిలో విప్లవాగ్నిని రగిలించిన యోధుడు. భగత్ సింగ్ అంటేనే ఒక మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పుకణిక దేశ స్వాతంత్య్రం కోసం తన స్నేహితులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించి,దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడారు. మర్చి 23, 1931 రాత్రి 7:30 గంటలకు అసువులు బాశారు. నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురిని నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరికొయ్య ముందు ఆ ముగ్గురు నిల్చుని ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి నేటి తరాలకు చేరింది.వారి స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థి, యువత పోరాడాలని, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హరీష్, అరవింద్,శ్రీహరి, సాయి ఈశ్వర్, అభిషేక్,సిద్దు, వంశీ,మహేష్, గణేష్, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.



