లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : ఐఎఫ్టీయూ

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : ఐఎఫ్టీయూ

విశ్వంభర, విద్యానగర్ : లేబర్ కోడ్స్‌ను పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలఅని ఐఎఫ్టీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాదు విద్యానగర్ లోని సెంట్రల్ లేబర్ రీజినల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం జరిగిన సభలో ఈ డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షులు బి.ప్రదీప్, ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఏప్రిల్ ఒకటి నుంచి లేబర్ కోడ్స్ అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా 44 కార్మిక చట్టాల్లోని కీలక 29 చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్స్ రూపొందించి పార్లమెంట్‌లో ఆమోదించుకున్నారని విమర్శించారు.ఈ కోడ్స్ అమల్లోకి వస్తే కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమ్మె హక్కు, యూనియన్ ఏర్పాటు హక్కు, చర్చల హక్కు, ఎనిమిది గంటల పని దినం వంటి మౌలిక హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దేశంలో సుమారు 50 కోట్ల కార్మికులకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు ఈ కోడ్స్ అమలు చేయబోమని ప్రకటించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ విదేశీ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే రూపొందించబడ్డాయని ఆరోపించారు. 93 శాతం అసంఘటిత కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, ఉద్యోగ భద్రత కోల్పోతారని, సంక్షేమ పథకాలు తగ్గిపోతాయని తెలిపారు. యాజమాన్యాలకు అధిక అధికారాలు ఇస్తూ హైర్ అండ్ ఫైర్ విధానానికి చట్టబద్ధత కల్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ.కృష్ణ, ఎం.శ్రీనివాస్, టీ.శ్రీనివాస్, బి.ప్రదీప్, ఎస్.వెంకటేశ్వర రావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లేబర్ రీజినల్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాకు పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

Tags: