కాముని చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

కాముని చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

విశ్వంభర, కూకట్ పల్లి : కాముని చెరువును త్వరితగతిన పునరుద్ధరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. హైదరాబాదు మూసాపేటలోని కాముని చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం సందర్శించారు. రెండో విడతలో పునరుద్ధరించనున్న 14 చెరువుల్లో ఈ చెరువు కూడా భాగమని అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరారు. కూకట్‌పల్లి నల్ల చెరువు తరహాలో అభివృద్ధి చేస్తే దోమల సమస్య తగ్గడంతో పాటు దుర్వాసన సమస్య కూడా పరిష్కారం అవుతుందని వివరించారు. ప్రస్తుతం దోమల తీవ్రత వల్ల ఇళ్ల తలుపులు తెరవలేని పరిస్థితి ఉందని తెలిపారు. చెరువు పునరుద్ధరణకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందని, అవి అందిన వెంటనే పనులు వేగవంతం చేస్తామని అధికారులు కమిషనర్‌కు తెలిపారు. అప్పటి వరకు తాత్కాలికంగా దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించడం, మురుగు నీటిని బయటకు పంపించడం వంటి చర్యలు వెంటనే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే కాముని చెరువు నుంచి మూసాయి కుంటకు వెళ్లే వరద కాలువ పనులను పరిశీలించి, సాంకేతిక లోపాలను నిర్మాణ దశలోనే సరిదిద్దాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఈ వర్షాకాలానికి ముందే చెరువును పునరుద్ధరించి స్వచ్ఛమైన నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Tags: