తోల్కట్టలో అమరవీరులకు నివాళులు
విశ్వంభర, మోహినాబాద్: మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామంలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి భానూరి శివ శంకర్ గౌడ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, సుఖదేవ్ వంటి మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలకులపై వీరోచితంగా పోరాడి అమరులయ్యారని పేర్కొన్నారు. వారి త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. భగత్ సింగ్ కలలు కనిన కుల, మత భేదాలు లేని, పేద-ధనిక తేడాలు లేని, అవినీతి రహిత సమాజ నిర్మాణం ఇప్పటికీ సాధించాల్సిన లక్ష్యమని తెలిపారు. నేటి యువత చెడు అలవాట్లకు, ముఖ్యంగా డ్రగ్స్ వంటి సామాజిక విపత్తులకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోల్కట్ట మాజీ సర్పంచ్ బి సత్యనారాయణ, ఉప సర్పంచ్ ఎండి ఇనాయత్, వార్డు సభ్యులు ఈ కుమార్, కే నవీన్, కే రమేష్, యువజన సంఘం నాయకులు చాకలి రవీందర్, మొండ్ర శ్రీకాంత్, చాకలి యాదగిరి, ఉమర్ ఖాన్, ముట్పురి శ్రీకాంత్, గౌడ్ ఆనంద్, కుమ్మరి విష్ణు, ఇంద్రసేన, బొక్క సురేందర్ రెడ్డి ,జనవరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు



