సహజ ప్రసవాల సంఖ్య పెంచాలి
- : జిల్లా కలెక్టర్ హైమవతి
విశ్వంభర, సిద్దిపేట: మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాల సంఖ్యను పెంచుతూ గర్భిణీలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్లు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీచేసి, గర్భిణీలకు అందించే వైద్యసేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద గర్భిణీలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆస్పత్రి భవనంతో పాటు అన్నిరకాల సదుపాయాలను కల్పించిందన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది ప్రతీ ఒక్కరు ఓపికగా వైద్యం చేయాలని సూచించారు. గర్భిణీలకు మనోధైర్యం కల్పిస్తూ ఆహారపు నియమాలు, సహజ ప్రసవాలు జరిగేలా యోగా లాంటి యాక్టివిటీస్ గురించి వివరించాలని సూచించారు. సహజ ప్రసవాలు పెంచాలని తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలోని వార్డులను కలియ తిరిగారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ డాక్టర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పై అధికారుల అనుమతి లేనిదే సెలవు తీసుకోవద్దని, తప్పనిసరిగా ఆస్పత్రిలో లీవ్ లెటర్ పెట్టాలని తెలిపారు.



