అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
- సిపిఐ(ఎం) డిమాండ్
విశ్వంభర, హైదరాబాదు: నగరంలో మురికివాడలు, అద్దె ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సిపిఐ(ఎం) గ్రేటర్ హైదరాబాదు సెంట్రల్ సిటీ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) గ్రేటర్ హైదరాబాదు సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్ మాట్లాడుతూ నగరంలో లక్షలాది మంది పేదలు మురికివాడలు, అద్దె ఇళ్లలో నివసిస్తూ సొంత ఇల్లు కోసం ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. ప్రస్తుతం ఎల్-1 కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలు అధిక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మురికివాడలలో నివసిస్తున్న పేదలకు అక్కడే జి+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, నగరంలోని ప్రభుత్వ భూములను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని కోరారు. అలాగే అసంపూర్తిగా ఉన్న సుమారు 35 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేసి పేదలకు కేటాయించాలని తెలిపారు. శివార్లకు తరలించిన పరిశ్రమల భూములను ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని, 20–25 సంవత్సరాలు పూర్తయిన పాత వాంబే, జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకులు మహేందర్, నరేష్ , మోహన్, అశోక్ , కిరణ్ , మారన్న కార్యకర్తలు పాల్గొన్నారు.



