బీజేపీ నాయకుల అరెస్టులు హేయమైన చర్య
విశ్వంభర, చింతపల్లి :
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత కల్పించాలని అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పిలుపునివ్వడంతో చింతపల్లి బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సముద్రాల నగేష్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బిజెపి కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి చేస్తారని భావించిన ప్రభుత్వం ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం జరిగిందన్నారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విస్మరించి ప్రజలను నట్టేట ముంచారన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీ నిలుపుకోవడం లేదన్నారు. మహిళలకు ప్రతి నెలకు రూ.2,500, రూ.500 గ్యాస్ సిలిండర్‌ను ఎగ్గొట్టిందన్నారు. రైతు భరోసాకు భరోసా లేకుండా పోయిందన్నారు. యువ వికాస పథకాన్ని గాలికి వదిలేసిందన్నారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు పత్తా లేకుండా పోయిందన్నారు. పెన్షన్లను పెంచుతామని మోసం చేసిందన్నారు. ఉచిత విద్యుత్ అందించే స్కీంను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుందన్నారు. అరెస్టు అయిన వారిలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, ఎర్ర వెంకటయ్య, బొడ్డు మహేష్, కొప్పుల మహేష్, కడారి కృష్ణ, చెనమోని మహేష్ తదితరులు ఉన్నారు.



