స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి
విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పిన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని , నిబంధనల ప్రకారం 80 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా అమలు కావడం లేదని సిపిఐ శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల్లో స్థానికులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల వారిని నియమిస్తున్నారని తెలిపారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి దొరకక వేరే రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలలో కూడా స్థానికులకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కొద్దిమంది స్థానికులకు మాత్రమే తక్కువ స్థాయి ఉద్యోగాలు, అటెండర్ పోస్టులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో స్థానికులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్థానికులకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగినప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా స్థానికులకు అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.



