కృష్ణదేవరాయల పాలన ఓ స్వర్ణయుగం
- : కోలేటి దామోదర్
విశ్వంభర, చిక్కడపల్లి : అష్టదిగ్గజాలు వంటి కవులను పోషిస్తూ వారి కావ్యరచనలకు ప్రోత్సాహం అందించిన శ్రీకృష్ణదేవరాయల పాలన ప్రజాశ్రేయస్కరంగా నిలిచి, ఆయన కాలం స్వర్ణయుగంగా చరిత్రలో నమోదైందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో శ్రీకృష్ణదేవరాయల స్మారక సమావేశం గానసభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన కృష్ణదేవరాయలు ఒడిశా, కర్ణాటక, కేరళతో పాటు తెలుగు ప్రాంతాల్లో సుస్థిర పరిపాలన అందించి ప్రజలకు శాంతి, ఆర్థిక స్థిరత్వం కల్పించారని వివరించారు. శత్రు రాజ్యాలను సమర్థంగా ఎదుర్కొని రాజ్యాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడిగా ఆయన నేటికీ ఆదర్శ పాలకుడిగా నిలిచారని తెలిపారు. సాహిత్యం, సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి నాగేశ్వరరావు, రాధారాణి, పి.ఎస్.ఆర్. మూర్తి పాల్గొన్నారు.



