సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలి
విశ్వంభర, చిక్కడపల్లి : సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేసి, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని సిడబ్ల్యుఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎం. సాయిబాబు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములు అప్పగించిన జీఓ నెం.12ను సవరించాలని కోరారు. హైదరాబాదు చిక్కడపల్లి లోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో 33 జిల్లాల కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల నిధులను ప్రైవేట్ సంస్థలకు మళ్లించడం అన్యాయమని, సహజ మరణానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని తెలిపారు. హెల్త్ టెస్టుల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోందని, పెండింగ్‌లో ఉన్న పరిహారాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గడువు ముగిసిన కార్మికుల హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో ఎస్. రామ్మోహన్రావు, వంగూరు రాములు, కె. ఈశ్వర్రావు, ఎం. శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



