కుల వ్యవస్థ నిర్మూలనకు సమగ్ర చర్యలు అవసరం: మంద కృష్ణ మాదిగ
విశ్వంభర, సోమాజిగూడ : సమాజంలో సమానత్వం సాధించాలంటే కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, అవి వివక్షతకు ప్రతిరూపమని విమర్శించారు. ఓసీ, బీసీ క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే వర్తించడం అన్యాయమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధమని తెలిపారు. క్రైస్తవ మతంలోకి మారిన అగ్రకులాల సామాజిక హోదా మారకపోతే దళితుల ఎస్సీ హోదా ఎందుకు మారాలని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్న అగ్రకుల క్రైస్తవుల మాదిరిగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ దళితుల సామాజిక స్థితిగతులు మారవని డా. బి.ఆర్. అంబేద్కర్ ముందే స్పష్టం చేశారని గుర్తుచేశారు. కుల వ్యవస్థ అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని, దళితులను హీనంగా చూసే పరిస్థితి తీసుకువచ్చిందని విమర్శించారు. దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూజారులుగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులు ఆత్మగౌరవం, సామాజిక హక్కుల కోసం పోరాటం చేయాలని, తమకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవిందు నరేష్ మాదిగ, ఇంజం వెంకటస్వామి మాదిగ, సోమశేఖర్ మాదిగ, జేపీ లత మాదిగ, కార్తీక్ మాదిగ, టీవీ నరసింహ మాదిగ పాల్గొన్నారు.



