పాఠశాల నీటి సమస్య తీర్చిన సర్పంచి
- ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు
విశ్వంభర, ఇనుగుర్తి: వేసవి దృష్ట్యా మండలం లోని పెద్దతండ(సిఎం)ప్రాధమిక పాఠశాల బాలబాలికలు నీటి కోసం ఇబ్బంది పడకూడదని యుద్ధ ప్రాతిపదికన జిపి నిధుల నుంచి సర్పంచి బానోతు రేణుక నరేష్ సంబంధిత వసతులను సమకూర్చారు. గతంలో ఉన్న బోరుకు సంబంధించిన స్టార్టర్, వైరు,పైప్ లైన్ పూర్తిగా పాడై నీరు సరఫరా కాకపోవడంతో పిల్లలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని చూసిన సర్పంచ్ తక్షణమే స్పందించి కొత్త మోటారు స్టార్టర్, వైరు, పైప్ లైన్ వేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి రేణుక నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారులు నీటి కోసం అల్లాడవద్దని వెంటనే మెటీరియల్ తెప్పించి ప్రారంభించినట్లు తెలిపారు. పాఠశాల బాలబాలికల ఇబ్బందిని గమనించి తక్షణమే నీటి సౌకర్యం కల్పించిన సర్పంచి బానోతు రేణుక నరేష్ దంపతులను ఆ పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు పూలదండలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యావంతురాలైన సర్పంచ్ కావడంతో విద్యార్థుల నీటి సమస్యపై తక్షణమే స్పందించారని ఉపాధ్యాయులు సర్పంచి దంపతులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం యుగేందర్, ఉపాధ్యాయులు సాయికుమార్, వార్డ్ సభ్యులు బిక్షం,సంతోష్,లక్ష్మి,శంకర్,బాలు, లచ్చిరాం,వెంకన్న,సీతు,చక్రు,లచ్చ,ఆలు,సురేష్, హాథిరాం జి పి సిబ్బంది సరోజ కారోబారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



