అసైన్డ్ భూములకు యజమాన్య హక్కులు కల్పించేందుకు కృషి
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం
విశ్వంభర, బషీర్ బాగ్: రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్ భూములను తిరిగి పేదలకు ఇవ్వాలనే సదుద్దేశంతో అసైన్డ్ భూములకు యజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అన్నారు. తెలంగాణ భూ రక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో చలో హైదరాబాద్ పేరుతో 'భూములు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీయే యజమాన్య హక్కులు కల్పించాలని' డిమాండ్ చేస్తూ 'భూ హక్కు సాధన సభనిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం మాట్లాడుతూ అసైన్డ్ భూములకు యజమాన్య హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 4 లక్షల ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు అసైన్డ్ భూములను లాక్కొని, నిరుపేద ప్రజలు, రైతులను రోడ్డున పడేశారని ఆరోపించారు.ధరణి పేరుతో అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేసి రూ.50 లక్షల కోట్ల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో రైతు కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ భూ రక్షణ సమితి (టీబీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. నండ్రు నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వాలు పంచిన అన్ని రకాల అసైన్డ్ భూములకు యజమాన్య హక్కులు కల్పించి, అన్యాక్రాంతమైన భూములను తిరిగి పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో, ఎంఎస్ నెం.20/9-12-22 రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ సంస్థ హైదరాబాద్ ద్వారా సేకరించిన భూములను లే-అవుట్ చేసిన దానిలో లబ్ధిదారులకు (అసైన్డ్ రైతులు) సగ భాగం (1200 గజాలు) ఇవ్వాలని, భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలని, ప్రభుత్వం నియమించే అసైన్డ్ కమిటీలలో అసైన్డ్ భూమి లబ్దిదారులను సభ్యులుగా నియమించాలని, తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూముల కమీషన్ ను వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములకు యజమాన్య హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంహెచ్ డీ గౌరవ అధ్యక్షులు డా.పెరమండ్ల రామకృష్ణ, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సత్తి మైసయ్య, సమితి గౌరవ సలహాదారులు రాపోలు రాములు, ప్రధాన కార్యదర్ని పాలెపాక జీవన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.



