గ్రామసభలకు సిద్ధంగా ఉండాలి
విశ్వంభర, సిద్దిపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు పూర్తిస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2తేదీన గ్రామసభ కార్యక్రమం నిర్వహించి అన్నిశాఖలకు సంబంధించిన పథకాల అమలు పూర్తి వివరాలను గ్రామసభలో పాల్గొన్న ప్రజలతో పంచుకోవాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి వివరాలను గ్రామాల వారీగా సిద్ధం చేసి ఆయా మండలాల ఎంపీడీవోలకు పంపించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే సబ్సిడీ గ్యాస్, సన్నవడ్లకు బోనస్, ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అన్ని పథకాల వివరాలను అందించడంతోపాటు లబ్ధిదారులచే సభలలో మాట్లాడించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాహనాల పంపిణీ తదితర కార్యక్రమాల గురించి సమాచారం సేకరించాలని చెప్పారు. 99రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్‌లో నిర్వహించే ఆరోగ్యం, రహాదారి, పిల్లల భద్రత మాదకద్రవ్యాలకు స్వస్తి.. కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



