వ్యవసాయ బడ్జెట్ సవరించాలి: రైతు సంఘం
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : వ్యవసాయ నామ సంవత్సరం అని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో కోత విధించడం అన్యాయమని, వెంటనే సవరించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే వ్యవసాయ బడ్జెట్ తగ్గించడం రైతులకు నష్టం కలిగిస్తుందని అన్నారు. మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం 7.15 శాతం మాత్రమే కేటాయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కౌలు రైతులకు రక్షణ, పంటల బోనస్, కనీస మద్దతు ధరలు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం వంటి కీలక అంశాలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 ప్రోత్సాహకం ఇవ్వాలన్న హామీ అమలు కాలేదని అన్నారు. వ్యవసాయ రంగానికి కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని, లేనిపక్షంలో మార్చి 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భాస్కర్, కూరపాటి రమేష్, ఆర్ శ్రీరామ్ నాయక్, బి ప్రసాద్, ఉడుత రవీందర్, విజయ్, కట్టా నరసింహ్మ, శివ, ఆర్ ఆంజనేయులు పాల్గొన్నారు.



