జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి
- డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి
విశ్వంభర, మహబూబాబాద్: సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో జనగణన, ఇళ్ల గణన ప్రక్రియలు, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, సిబ్బంది శిక్షణ, డేటా సేకరణ విధానాలు వంటి అంశాలపై డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి కలెక్టర్లకు సూచనలు అందించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, గణన చేయాలని తెలిపారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. మండలాల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. జిల్లా పరిధిలో సెన్సస్ కార్యక్రమం విజయవంతం అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే శిక్షణా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సి.పిఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.



