నిజామాబాద్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు, రంజాన్ కిట్ల పంపిణీ

నిజామాబాద్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు, రంజాన్ కిట్ల పంపిణీ

విశ్వంభర, నిజామాబాద్: ​నిజామాబాద్ నగరంలోని ఖిలా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందు సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్న ‘రంజాన్ తోఫా’ దుస్తుల కిట్లను అతిథులు పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ హాజరయ్యారు. ​ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ, గంగా-జమునా తెహజీబ్‌కు నిజామాబాద్ ప్రతీక అని కొనియాడారు. రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పేద మైనారిటీలకు అండగా ఉండటానికే ప్రభుత్వం ఈ తోఫా కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందనిస్పష్టం చేశారు.  ​ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను అమలు చేస్తోంది. ​మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యానిధి వంటి సదుపాయాలను మెరుగుపరిచాం. ​పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ‘షాదీ ముబారక్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ​వక్ఫ్ భూముల రక్షణ మరియు ఉర్దూ భాషా వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ​ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం మైనారిటీ సంస్థలను బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేశ శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థన చేశారు.

Tags: