కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారుల డైరీ ఆవిష్కరణ
విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, విధి నిర్వహణలో ఉంటూ మరణించిన రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి 75 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అతిథులు అందజేశారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ , ప్రభుత్వ యంత్రాంగంలో రెవెన్యూ విభాగం వెన్నెముక వంటిది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీరు అందిస్తున్న సేవలు అభినందనీయం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తాం. రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవలో మీ పాత్ర మరింత పెరగాలి. పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ , రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పనిచేస్తుంటారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, ఇతర సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మీరు నిబద్ధతతో పనిచేయండి, మీ వెనుక ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ , నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో రెవెన్యూ అధికారుల సహకారం ఎంతో ఉంది. డైరీ ఆవిష్కరణ ద్వారా మీ ఐక్యతను చాటడం సంతోషకరం. అధికారుల సమస్యల పరిష్కారానికి నేను వ్యక్తిగతంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంఘాల నాయకులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



