సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపాలి
విశ్వంభర, హైదరాబాదు : పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సి.హెచ్. రంగయ్య, జాతీయ కన్వీనర్ ముదిగొండ త్యాగరాజు, జాతీయ సలహాదారు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నగరాలు, పట్టణాల్లోని చెరువులు, కుంటలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. ఇవి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కాల్చడం వల్ల విడుదలయ్యే విషవాయువులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేయాలని కోరారు. అలాగే జ్యూట్, పేపర్, బట్ట సంచుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి చిన్నతరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత తెలంగాణ కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు.



