పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామచంద్రస్వామి
On
విశ్వంభర, భద్రాచలం :- భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరవ రోజు అయిన నేడు స్వామివారు పరశురామ అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయ వేళ ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామివారిని ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా బేడా మండపం వద్దకు తీసుకువచ్చి పరశురామ అవతారాన్ని అలంకరించి వేదోక్త మంత్రోచ్ఛారణలతో విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పరశురామ అవతారంలోని స్వామివారి దర్శనంతో ఆలయ ప్రాంగణమంతా జయజయధ్వానాలతో మార్మోగగా భక్తులు భక్తి పరవశులయ్యారు. అనంతరం బేడా మండపంలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతీక అయిన తిరుప్పావై ప్రవచనాలు, పారాయణం భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేద పండితులు తిరుప్పావై పాశురాలను వివరిస్తూ వాటి అంతర్లీన ఆధ్యాత్మిక భావాలను భక్తులకు వివరించారు. మధ్యాహ్నం స్వామివారికి మహానివేదన సమర్పించిన అనంతరం సాయంత్రం వేళ స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరనున్నారు. మంగళ వాయిద్యాలు, కోలాటం నృత్యాలు, సకల రాజలాంఛనాల నడుమ స్వామివారి తిరువీధి సేవను ఘనంగా నిర్వహించనుండగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య దర్శనం పొందనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా చేపట్టారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు భద్రాచలంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతుండటంతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.



