రూ.5 కోట్ల ఆస్తులు సీజ్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంది. బినామీ లావాదేవీల చట్టం కింద సిద్ధిపేట, జనగామ జిల్లాల్లో ఉన్న పలు కీలక ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆస్తులు యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పేరు మీద కొనుగోలు చేసినవని, అయితే వాటికి వెనుక ఉన్న వాస్తవ లబ్ధిదారుడు ఆయనేనని ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ విచారణ ప్రారంభించింది.
విచారణలో భాగంగా, గత కొన్నేళ్లుగా జనగామ, సిద్ధిపేట ప్రాంతాల్లో తుల్జా భవానీ రెడ్డి పేరుతో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలపై అనుమానాలు పెరగడంతో, ఆ భూముల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తుల్జా భవానీ రెడ్డిని విచారించగా, భూముల కొనుగోలుకు ఉపయోగించిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు స్పష్టమైన సమాచారం లేదని ఆమె వెల్లడించినట్లు తెలిసింది.
అదేవిధంగా.. తన తండ్రి సూచన మేరకే తాను పత్రాలపై సంతకాలు చేసినట్టు, ఆస్తుల కొనుగోలు వ్యవహారాల్లో తాను ప్రత్యక్షంగా పాల్గోలేదని ఆమె ఐటీ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని ఐటీ శాఖ ఉన్నతాధికారులు అధికారికంగా నమోదు చేశారు. ఈ స్టేట్‌మెంట్‌తో పాటు సేకరించిన ఇతర ఆధారాల ఆధారంగా, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసలు లబ్ధిదారుడిగా నిర్ధారించుకుంటూ సిద్ధిపేట, జనగామ జిల్లాల్లోని సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు.ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ కొనసాగుతోందని, అవసరమైతే తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశముందని ఐటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.



