కబ్జాదారులు స్వేచ్ఛగా ఉంటే.. పేదల గూడు చెదరగొడతారా?: ఈటల రాజేందర్

కబ్జాదారులు స్వేచ్ఛగా ఉంటే.. పేదల గూడు చెదరగొడతారా?: ఈటల రాజేందర్

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును శత్రుదేశం దాడితో పోల్చారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన బడా బాబులను వదిలేసి, తలదాచుకోవడానికి చిన్న గూడు కట్టుకున్న నిరుపేదలపై ప్రతాపం చూపడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్, ఇనాం, భూదాన్ భూములు ప్రస్తుతం ఎవరి గుప్పెట్లో ఉన్నాయో నిగ్గుతేల్చే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. పేదల కులమంతా ఒక్కటేనని, వారి జోలికి వస్తే ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు.

గత ప్రభుత్వాల కంటే ఘోరమంటూ విమర్శలు
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూములపై కన్నేసిందని, అయితే ప్రజల తిరుగుబాటును చూసి అప్పట్లో వెనక్కి తగ్గిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కొత్తగా భూములు ఇవ్వకపోగా, ఉన్న నివాసాలను లాక్కోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తెల్లవారుజామునే భారీగా పోలీసులను మోహరించి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చివేయడం పాలకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెలుగుమట్ల ఘటనతో తేలిపోయిందని, తక్షణమే కూల్చివేసిన ప్రాంతంలోనే బాధితులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు కూల్చిన పాపం ఊరికే పోదని, రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Read More వనస్థలిపురం 2026 బ్యాడ్మింటన్  టోర్నమెంట్ ప్రారంభం. - ముఖ్య అతిధిగా పాల్గొన్న సామాజికవేత్త , బి.యన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత

 

Related Posts