ఇరాన్‌పై 'ఇజ్రాయెల్-అమెరికా' విరుచుకుపాటు
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంటుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి.
విశ్వంభర, బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంటుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక బాలికల పాఠశాల లక్ష్యంగా జరిగిన దాడిలో 40 మంది విద్యార్థినులు మరణించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దాడి సమయంలో పాఠశాలలో సుమారు 170 మంది విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 45 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇరాన్ పారామిలిటరీ దళమైన 'ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్' స్థావరం ఈ ప్రాంతంలో ఉండటమే దాడులకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ దారుణ మారణకాండతో ఇరాన్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
రాజకీయ విమర్శలు - అంతర్జాతీయ స్పందన
ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చేస్తున్న ఈ యుద్ధం అక్రమమని ధ్వజమెత్తారు. ట్రంప్ తన 'అమెరికా ఫస్ట్' నినాదాన్ని 'ఇజ్రాయెల్ ఫస్ట్'గా మార్చేశారని ఎద్దేవా చేశారు. దురాక్రమణదారులకు తమ సాయుధ బలగాలు తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. మరోవైపు రష్యా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్, అమెరికాలు అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కాయని ఆరోపించింది. ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు సైతం వెంటనే దాడులు ఆపి, దౌత్య చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశాయి.
స్తంభించిన రవాణా వ్యవస్థ.. భారతీయులకు అలర్ట్
యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ దేశాల రవాణాపై తీవ్రంగా పడింది. దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అల్ మక్తుమ్ విమానాశ్రయాల కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండవని ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరపాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.



