వేట్లపాలెంలో మృత్యు విస్ఫోటనం.. 23 మంది సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా దద్దరిల్లింది. గోదావరి కెనాల్ పక్కనే ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణాసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంభవించిన భారీ పేలుడు 23 మంది నిరుపేద కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది.
విశ్వంభర, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా దద్దరిల్లింది. గోదావరి కెనాల్ పక్కనే ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణాసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంభవించిన భారీ పేలుడు 23 మంది నిరుపేద కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. పేలుడు ధాటికి భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రమాద సమయంలో లోపల మొత్తం 34 మంది పనిచేస్తుండగా, మంటల తీవ్రతకు 21 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మిగిలిన 13 మంది కార్మికులు తీవ్ర గాయాలపాలవగా, వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కార్మికులే ఉండటం స్థానికులను కలచివేసింది.
యుద్ధక్షేత్రాన్ని తలపించిన ఘటనాస్థలి
ఈ విస్ఫోటనం ఎంత శక్తివంతంగా ఉందంటే, దాని శబ్ద తీవ్రతకు సుమారు 5 కిలోమీటర్ల మేర భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాల భవనం స్లాబ్‌కు సైతం పగుళ్లు వచ్చాయి. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలకు అక్కడ భీభత్సమైన దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండగా, కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. సామర్థ్యానికి మించి నిల్వ చేసిన మందుగుండు సామాగ్ర వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, హోం మంత్రి అనితను వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు హోం మంత్రి అనిత హుటాహుటిన వేట్లపాలెం బయలుదేరారు. ఇప్పటికే పోలీసులు 11 మంది మృతుల వివరాలను సేకరించారు. మృతుల్లో అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, ధనరాజు, సత్యవేణి వంటి వారు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా, బాధిత కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.



