మక్కా యాత్ర ప్రమాద బాధితులకు 'రేవంత్' చేయూత
మక్కా యాత్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మక్కా యాత్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన వారికి రూ.3లక్షల చొప్పున సాయం అందజేశారు. పవిత్ర యాత్రకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లడం అత్యంత దురదృష్టకరమని, ఆయా కుటుంబాల్లోని కష్టాలను తీర్చలేకపోయినా, ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాధితులకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఘటన నేపథ్యమిదే..
గతేడాది నవంబర్ 17వ తేదీన మక్కా నుంచి బయలుదేరిన యాత్రికుల బస్సు మదీనా సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందున్న డీజిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన 44 మంది యాత్రికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు క్షణాల్లో బస్సు అంతటా వ్యాపించి, లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ వార్త అప్పట్లో నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలను గుర్తించి, వారికి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టింది.



