సంతోష్‌ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే!

సంతోష్‌ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే!

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. సంతోష్‌ రావు ఒక "గూఢచారి" అని విమర్శించారు. ఉద్యమకారులకు, ఉద్యమ నాయకుడికి మధ్య ఆయనే అడ్డుగోడగా మారారని సంచలన ఆరోపణలు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.

"ఉద్యమ నాయకుడిని (కేసీఆర్) సొంత కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు దూరం చేసింది సంతోష్ రావే. గద్దర్ వంటి గొప్ప నాయకులు కూడా ప్రగతి భవన్ గేటు బయట నిలబడాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆయనే" అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మొదటి నుంచి చెబుతున్న 'దెయ్యం' ఆయనే. ఇప్పుడు అది రుజువవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో స్పందించారు. సిట్ ఆయనకు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలని.. కానీ, ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం తనకు లేదంటూ విచారణ తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు.

Read More విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలి.

క్షీణించిన శాంతిభద్రతలు
రాష్ట్ర ప్రభుత్వంపై కవిత విమర్శలు గుప్పించారు. ఎక్సైజ్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బందిపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్మగ్లర్లకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని, గంజాయి సరఫరాదారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఎక్సైజ్, అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తేనే నేరగాళ్లలో భయం ఉంటుందని కవిత సూచించారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతోందని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.