మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు.. త్వరలోనే షెడ్యూల్..!!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ వివరాలను తుది రూపంలో సిద్ధం చేసింది. శనివారం సాయంత్రం నాటికి మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికానుంది.
ఈ రిజర్వేషన్ జాబితాను శనివారం రాత్రికి లేదా ఆదివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధంగా ఉంది. ఒకటి నుంచి రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
రిజర్వేషన్ వివరాల ప్రకారం, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, బీసీకి మూడు స్థానాలు కేటాయించగా, వాటిలో ఒకటి బీసీ మహిళలకు కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్న ఐదు కార్పొరేషన్లలో నాలుగు మహిళలకు కేటాయించడం విశేషంగా మారింది. ఇక 121 మున్సిపాలిటీల విషయానికి వస్తే, ఎస్సీకి 17, ఎస్టీకి 5, బీసీకి 38, జనరల్ కేటగిరీకి 61 మున్సిపాలిటీలను కేటాయించారు.
కార్పొరేషన్‌ల వారీగా చూస్తే.. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ (జనరల్)కు, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ (జనరల్)కు కేటాయించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ బీసీ మహిళలకు, మంచిర్యాల మరియు కరీంనగర్ కార్పొరేషన్లు బీసీ (జనరల్)కు దక్కాయి. ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ కార్పొరేషన్లు జనరల్ మహిళలకు కేటాయించగా, వరంగల్ కార్పొరేషన్ జనరల్ కేటగిరీకి ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కూడా జనరల్ మహిళలకు కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రిజర్వేషన్ ప్రక్రియతో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది.



