లక్ష్యంతో చదవాలి

లక్ష్యంతో చదవాలి

  • జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 
  • కస్తూర్బా గాంధీ విద్యాలయం తనిఖీ
  • విద్యార్థులతో కలిసి భోజనం
  • సౌకర్యాలపై ఆరా 

విశ్వంభర, సంగారెడ్డి: విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉద్బోధించారు. నారాయణఖేడ్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలలో అందిస్తున్న వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.విద్యార్థులకు భోజన సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం రుచిగా ఉందా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో భోజన సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,  చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.శాసనసభ్యులు సంజీవరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ విద్యా విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నారాయణఖేడ్ పట్టణంలోని అర్బన్ ఫారెస్ట్‌ను పరిశీలించారు. స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడి వసతి సౌకర్యాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. గ్రంథాలయంలో  సౌకర్యాలఫై అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా భారతి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: