భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశ్వంభర, భద్రాచలం:-దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన కార్యాలయంలో సోమవారం ఉదయం 8 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేవస్థాన కార్యనిర్వాహణాధికారి శ్రీ దామోదర్ నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించగా, కార్యక్రమంలో పాల్గొన్న అందరూ దేశభక్తి భావాలతో జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా ఈవో శ్రీ దామోదర్ మాట్లాడుతూ… భారతదేశం అనేక త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యాన్ని సాధించిందని, ఆ స్వాతంత్ర్యానికి రాజ్యాంగమే పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు విధులను కూడా ప్రతి పౌరుడు నిబద్ధతతో పాటించాలని సూచించారు. దేశ సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలలో జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించడం ద్వారా దేశభక్తి భావాన్ని ప్రజల్లో మరింత బలంగా నాటవచ్చని అన్నారు. దేవస్థానం పరిధిలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని సూచించారు.ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బంది, అలాగే ఎస్పీఎఫ్ (SPF) భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చారు.

Tags: