రాజేష్ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలి 

రాజేష్ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలి 

  • మందకృష్ణ మాదిగ డిమాండ్ 

విశ్వంభర,  నాగారం : సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి,  రిటైర్డ్ జడ్జి తో విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు  మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజేష్ సంతాప సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ నిధుల మళ్లింపు కేసులు రాజేశ్ ను అదుపులోకి తీసుకొని నాలుగురోజుల పాటు చిలుకూరు, రూరల్ పోలీస్ స్టేషన్లకు తిప్పి చిత్రహింసలు పెట్టడంతోనే మృతి చెందాడన్నారు. అమాయక దళితులను చంపి డబ్బు ఆశ చూపడం ద్వారా నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. రాజేశ్ కేసు విషయంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే దళితుల  ప్రాణాలకు విలువ లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమై కేసును నీరు గారుస్తు న్నారని ఆరోపించారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం బాధకరమని అన్నారు. రాజేశ్ మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  కర్ల రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  ఎంఎస్ ఎఫ్  జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్,ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న,  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బొజ్జ సైదులు, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర రావణ్  , రాగల ఉపేందర్, మల్లె పాక అనిల్, చిప్పలపల్లి మల్లేష్ , రాములు ,కూర వెంకన్న,  పేరాల యాదగిరి, కన్యబోయిన బాలమణి దేవరకొండ యాదగిరి , రామకృష్ణ ,శ్రీనివాస్, సత్యం వెంకన్న మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags: