పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, నిజామాబాద్: నందిపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్,, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ గణేష్ హాజరు పట్టికలో సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకబు చేశారు. గత మూడు రోజులుగా పీ హెచ్ సీ కి రాలేదని తెలియడంతో, సీనియర్ అసిస్టెంట్ గణేష్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల వివరాలను పరిశీలించి కీలక సూచనలు చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు.



