'సొంతింటి' చూపు.. శివారు వైపు
భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో అభివృద్ధి శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు నగరానికి దూరంగా భావించిన ప్రాంతాలు నేడు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో అభివృద్ధి శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు నగరానికి దూరంగా భావించిన ప్రాంతాలు నేడు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. ఈ క్రమంలోనే భూముల లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ఉన్న స్థలాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మధ్యతరగతి కుటుంబాలు నగర పరిధిలో గజం స్థలం కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణ, మున్సిపాలిటీల విలీనం వంటి పరిణామాలు రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్, ఫోర్త్ సిటీ ప్రాజెక్టులతో రంగారెడ్డి జిల్లా చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకునే సంపన్నులు సైతం ఇటువైపే మొగ్గు చూపుతున్నారు.
అభివృద్ధి బాటలో కుగ్రామాలు
ఒకప్పుడు కేవలం వ్యవసాయానికే పరిమితమైన కుగ్రామాలు ఇప్పుడు కాస్ట్లీ అడ్రస్‌లుగా మారుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం, సాగర్, విజయవాడ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ప్రాంతాలు గత నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధిని సాధించాయి. ప్రధాన రహదారులకు ఐదారు కిలోమీటర్ల లోపల కూడా భారీ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. ఓఆర్ఆర్ ప్రయాణం సులభతరం కావడంతో ఐటీ ఉద్యోగులు గంటలోపే గచ్చిబౌలి వంటి కార్యాలయ ప్రాంతాలకు చేరుకోగలుగుతున్నారు. దీనికి తోడు మెట్రో రైలు విస్తరణ వార్తలు ఈ ప్రాంతాల విలువను మరింత పెంచాయి. ఫోర్త్ సిటీలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు వంటి నిర్ణయాలు భద్రతపై నమ్మకాన్ని కలిగించడంతో కొనుగోలుదారులు వెనకాడటం లేదు.
మౌలిక వసతులతో సరికొత్త లేఅవుట్లు
వినియోగదారుల ఆసక్తిని గమనించిన రియల్ ఎస్టేట్ సంస్థలు వినూత్న థీమ్స్‌తో వెంచర్లను తీర్చిదిద్దుతున్నాయి. వీకెండ్ హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ వంటి కాన్సెప్టులతో సకల సదుపాయాలను కల్పిస్తున్నాయి. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలతో పాటు విద్యుత్ సదుపాయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్కులు రావడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. పెద్ద విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూళ్లు సైతం ఇక్కడే కొలువుదీరుతుండటంతో మధ్యతరగతి ప్రజలు తమ నివాసాన్ని శివారుకే పరిమితం చేసుకుంటున్నారు. తక్కువ ధరలో ఎక్కువ స్థలం దొరకడమే కాకుండా భవిష్యత్తులో పెట్టుబడిపై భారీ లాభాలు వస్తాయన్న ధీమా అందరిలో కనిపిస్తోంది.
సర్కారీ ప్లాట్లపై పెరిగిన నమ్మకం
ప్రైవేట్ వెంచర్లతో పోటీగా ప్రభుత్వం సైతం మధ్యతరగతి ప్రజల కోసం భారీ లేఅవుట్లను సిద్ధం చేస్తోంది. తొర్రూరు వంటి ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ వేలం వేస్తున్న ప్లాట్లకు వస్తున్న స్పందన ఇందుకు నిదర్శనం. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేలంలో రికార్డు స్థాయి ధరలు పలుకుతుండటం రియల్ రంగం ఊపును తెలియజేస్తోంది. దీంతో మరింత ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు సామాన్యులకు భరోసా ఇచ్చేందుకు ల్యాండ్ పూలింగ్ విధానంపై సర్కారు దృష్టి సారించింది. సాగుకు అనువుగా లేని భూములను సేకరించి వందల ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇది అటు రైతులకు, ఇటు కొనుగోలుదారులకు మేలు చేయడంతో పాటు శివారు ప్రాంతాల రూపురేఖలను మార్చేయనుంది.



