పేదలను కాల్చి చంపావ్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మల్లు రవి ఫైర్
పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలను కాల్చి చంపిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ది అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. ప్రవీణ్ కుమార్ మతిస్థితితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అంతేకాదు.. బుల్‌డోజర్ సంస్కృతి తమది కాదని మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఏం జరిగిందని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలో చెప్పాలని ఆర్ఎస్పీని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఎన్ కౌంటర్లు చేసింది నువ్వు కాదా? అని నిలదీశారు.
అచ్చంపేటలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని మల్లురవి అన్నారు. ఒకే ఒక్క చిన్న ఘటన జరిగిందని.. అది కూడా బీఆర్ఎస్ నేత పోలింగ్ స్టేషన్‌లో విధ్వంసానికి ప్రయత్నించాడని ఆరోపించారు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలిసులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడితే.. ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచే ఆ చర్యలు మొదలు పెట్టాలని అన్నారు. పరిటాల రవి హత్య జరిగిన కేసులో ప్రవీణ్ కుమార్ పై కూడా ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అనంతపురం ఎస్పీగా ఆర్ఎస్పీ ఉన్నారని మల్లు రవి గుర్తు చేశారు.
కొల్లాపూర్‌లో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులు పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. త్వరలోనే నిజాలన్ని బయటకు వస్తాయని మల్లు రవి అన్నారు. కేసీఆర్ చెప్తే ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అది వర్క్ అవుట్ కాలేదు కాబట్టి డైరెక్ట్‌గా బీఆర్ఎస్‌లో చేరారని మల్లు రవి అన్నారు.