అఖండ-2 అఖండమైన విజయం సాధిస్తుంది
- అఖండ-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
- అభిమానులతో కలిసి ఎమ్మెల్యే భారీ బైక్ ర్యాలీ
విశ్వంభర, అనంతపురం : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నటించిన అఖండ-2 అఖండమైన విజయం సాధిస్తుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అఖండ-2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం నగరంలో టిడిపి నాయకులు, నందమూరి బాలకృష్ణ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. నగరంలోని ప్రధాన వీధుల మీదుగా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ఆ బైక్ ర్యాలీ సాగింది. గౌరీ థియేటర్ లో శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ నేను మొదటి నుంచి బాలకృష్ణ అభిమానినని.. ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. అఖండ-2 సినిమా ఈనెల 5వ తేదిన రిలీజ్ కావాల్సి ఉందని.. కొన్ని కారణాల వలన వాయిదా పడిందన్నారు. ఇప్పుడు అన్ని అవాంతరాలను దాటుకుని.. శుక్రవారం రిలీజ్ కానుందన్నారు. అఖండ-1కు మించి అఖండ-2 సినిమా విజయవంతమవుతుందన్నారు. ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూస్తారన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక డాకూ మహారాజ్ సినిమా మంచి విజయం సాధించిందని.. ఈ సక్సెస్ మీట్ అనంతపురంలో నిర్వహించారన్నారు. ఇప్పుడు అఖండ-2 సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని..ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా అనంతపురంలోనే నిర్వహించాలని బాలక్రిష్ణను కోరుతామన్నారు. అఖండ-2 చిత్రం యూనిట్ కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.



