దోమల సమస్యను పరిష్కరించాలి 

దోమల సమస్యను పరిష్కరించాలి 

  • ప్రజావాణిలో మాజీ కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా

విశ్వంభర, ఎల్‌.బి. నగర్: ఎల్‌.బి. నగర్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా పాల్గొని, డివిజన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కమిషనర్ కృష్ణకుమారికి వినతి పత్రాన్ని అందజేశారు. చైతన్యపురి  డివిజన్‌లో ప్రస్తుతం దోమల సమస్య తీవ్రంగా ఉన్న  నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డివిజన్ మొత్తం వారానికి కనీసం 3 నుండి 4 సార్లు రెగ్యులర్‌గా ఫాగింగ్ నిర్వహించాలనీ కోరారు. అలాగే లార్వా నివారణ చర్యలను కూడా మరింత బలంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చైతన్యుపురి  డివిజన్ అభివృద్ధి కోసం మంజూరైన సుమారు రూ. కోటి విలువైన అభివృద్ధి పనులు ఇప్పటివరకు టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదని, వాటిని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను కోరారు. చైతన్యుపురి డివిజన్‌లో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి, ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం ద్వారా వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కల నియంత్రణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ తాజా  మాజీ బీజేపీ కార్పోరేటర్లు, జిహెచ్ఎంసి అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: