కౌమార దశ విద్యపై అవగాహన కార్యక్రమం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌమార దశ విద్యపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం పోస్టర్ తయారీ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కౌమార దశ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాధ్యతాయుతమైన ప్రవర్తన, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలపై సృజనాత్మక పోస్టర్లు రూపొందించారు. పోటీ ఫలితాల్లో మొదటి స్థానం ఎం.తుర్కపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, రెండవ స్థానం అడ్డగూడూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ, మూడవ స్థానం ఆలేరులోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పొందాయి. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కె.సత్యనారాయణ, రామన్నపేట మండలం, ఎన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఎన్.శేఖర్ లు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్ గా ఎన్.శేఖర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా.వంశీ కృష్ణ–ఏరియా హాస్పిటల్, భువనగిరి, ముత్తయ్య–ఎయిడ్స్ ప్రోగ్రామ్ కౌన్సిలర్ కోఆర్డినేషన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఏ.ఎం.ఓ జానీ అఫ్గాన్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యా అధికారి కె.సత్యనారాయణ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కౌమార దశ ఆరోగ్యం, అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తన గురించి చైతన్యం పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతను ప్రోత్సహించబడింది.



